Friday, December 3, 2010
Dr.K.BALA JAGANNADHA RAO NAANEE
డా. కొణతాల బాలజగన్నాధరావు గారు వివిధ సాహితీ,సేవారంగ సంస్థల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సభ్యులు. వీరు ఇండియన్ హైకూ క్లబ్ సలహా సంఘ సభ్యులు కూడా. సెప్టెంబర్ 19 న ఇండియన్ హైకూ క్లబ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి నానీల సదస్సులో ఆత్మీయ అతిథిగా పాల్గొనడమే గాకుండా ఆశువుగా ఒక చక్కని నానీని సభలో చెప్పి ఎంతోమంది ప్రశంసల్ని పొందారు. ఆ నానీకి దృశ్యమే ఈ క్రింది ఫోటో నానీ.
PRITHVI NAANEE POETRY
డా.తలతోటి పృథ్వి రాజ్
"నలుదిక్కుల నానీలు"
సంకలనంలోనివి
అనుభవ పాఠాల్ని
పఠించాలనుకునేవాళ్లేరీ
మహా గ్రంథాలే
వృద్ధులు
దళారులు
ఉరితాడు లేకుండానే
రైతుల ఉసురుతీసే
తలారులు
సామాజిక కవిత్వం
ప్రారంభించాను
కలం
అక్షరాల కొలిమైంది
ఎక్కడ చూసినా
గుళ్ళూ ,చర్చీలు, మసీదులు!
సామరస్యానికి
చోటేక్కడా?
నిజం
ఎప్పటికీ నిప్పే
అబద్దమే
నిజాన్ని దాచాననుకునే నివురు
భూగోళం అంచుపై
కనురెప్పను వాల్చింది
కాంతినేత్రం.
- పురివిప్పిన నింగి
మూగవాళ్ళ
సంజ్ఞలు
మాటల మోసాలు లేని
స్వచ్ఛ మైన భాష
భార్యంటే నేటి అర్థం
భర్తలో సగం కాదు
కష్టాల్లో పూర్ణం
సుఖాల్లో శూన్యం
చచ్చాక కూడా
ఆక్రమణలే !
కూడళ్ళలో
నాయకుల విగ్రహాలు !!
నలుదిక్కులు
ప్రసరించిన
హృదయభాను కిరణాలు
నానీలు
జీవితమంటే
రోజూ కొంచెం కొంచెం
ఆశతో
బ్రతుకుతూ చావడం
పిల్లాడి చేతిలో
బలపమై
వెలిగిపోతూ ఆరిగిపోతూ
మాస్టారు
ఆకలి తీర్చేందుకు
దొరకని గంజి
నేత ఖద్దరు చొక్కాకు
కానుకైంది
నాది డాక్టరేట్
మా అబ్బాయ్ ఫోర్త్ క్లాస్
నాకంటే
మావాడి చదువే 'విలువైంది'
వంటింటి
కారాగార గృహంలో
ఆజన్మాంత ఖైదీ
త్యాగాల అమ్మ
ఎలుకల గొడవ
పిల్లి తీర్చునో లేదో గాని
దొంగల పంపకం
పోలీస్లే...!
ఇల్లు శుభ్రంగా ఉంచుతాడు
వీధే... !
మనిషి శుభ్రంగా ఉంటాడు
కాని మనసే...!!
ప్రజాస్వామ్య క్షేత్రంలో
కలుపు మొక్కలు..
పదునులేని కొడవళ్ళు
ప్రజలు
దేశపౌరుల తలరాతల్ని
తిరగరాసే
అపర బ్రాహ్మలు
నేతలు
వారధి మీదుగా
అఘాదాల్ని దాటుతాం
స్నేహ వారదుల్నే
నిర్మించుకోం!
ఎగువ రాష్ట్రం
డ్యాంల నిర్మాణం .
బురద చల్లుకుంటూ
పాలక-ప్రతిపక్షాలు.
దొంగలందరూ
ఒకేలా పుట్టరు
కొందరు ఆకల్లోంచి
ఎందరో ఓట్లలోంచి...
పట్టా భూమితో
రైతుకి భరోసా.
ఎన్ని పట్టాలున్నా
నిరుద్యోగికి నిరాశ!
అనగనగా...
ఒకానొకప్పుడు పిచ్చుకలు!
సెల్ ఫోన్ హత్యలకు
తొలి బలి
ఎన్నో పార్టీలే కల్సి
పాలన సాగిస్తుంటే
వెర్రోళ్ళు
విడాకులు కావాలట!
* * * * * * *
డా.తలతోటి పృథ్వి రాజ్
"క్రాంతి నేత్రం" నానీల సంపుటి
(అముద్రితం)
మరణించడమంటే
మహా యాత్రను చాలించడం
మరొక్కరికి
చోటివ్వడం
పడమర
అగాధపుటంచుల్లో తొంగి చూడు
రోజుల
శకలాల కోసం
రోజూ రగిలే
ఎందరి విప్లవ స్వప్నాలో
ధరిస్తూ
పునర్జన్మల రవి
యాంత్రిక లోకమే అనుకున్నా
తాంత్రిక లోకంగా తీర్చే
బాణామతి...
బాబాలు !
విలువైనవెన్నో
వెలికి తీస్తాడు
విలువలేకుండా
మట్టిలోకి మనిషే...
దేవుడి దర్శనానికి
గుడిమెట్లు
జీవితాదర్శానికి
బతుకు మెట్లు
క్షణికావేశపు చిహ్నానికి
చెత్తలా
విసిరి పడేసేందుకేమో
చెత్త కుండీలు
చిగురు
చైతన్యానికి ప్రతీక!
పండుటాకు
అనుభవాల సంపుటి!!
వరల్డ్ బ్యాంక్
ప్రతినిధుల రాక
బిచ్చగాళ్ళను తరిమేస్తూ
ప్రభుత్వ బిచ్చగాళ్ళు
ఒకపూట
భోంచెయ్యడం కుదరలేదు
ఆకలి బాధ
రుచితెలిసింది
ప్రతి తల్లీ
వీరమాతే
రక్తం అద్ది బిడ్డను పంపు
జీవన సమరానికి
Subscribe to:
Posts (Atom)