నానీలు - పుస్తక సమీక్షలు


“ప్రకాశ”వంతమైన నానీలు
డా. ఎన్.గోపి కవితా సృష్టి నానీల అయస్కాంత ఆకర్షణకు గురియైన యువ భావకుల్లో మరొకరు పనసకర్ల ప్రకాశ్. విచిత్రమేమిటంటే అతని ముద్దు పేరుకూడా నానీయే !.  తన గురువైన కీ.శే.శ్రీ తుమ్మిడి నాగభూషణం గారిని తలుచుకుంటూ  ”గోదారి కెరటాలు”అనే నానీ సంపుటిని ప్రచురించి వారికే గురుదక్షిణగా సమర్పించుకున్నాడు. తన గుండె గోదారిలో ఒకో నానీ ఒకో కెరటంలా ఎగసిపడి నిండిన నానీల కలశం ఈ సంపుటి అనవచ్చు.
“ఎన్ని కన్నీళ్ళు
పెట్టించానో…నేను
ఐనా చూడండి
వారికళ్ళల్లో…నేనే …”
అంటాడు మమకారానికి మారుపేరుగానిలిచే తల్లిదండ్రులను తలచుకొని.
వేకువనాటి   ప్రభాత కిరణాలతో ప్రకాశించే గోదారి అలలలా …  ప్రకాశ్ ప్రకాశించే నానీలను ఈ సంపుటిలో ప్రసరించాడని అనిపిస్తుంది. ఉదా:
“బంధాలు
కాలి బూడిదై పోయాయి
శవం ఇంకా
కాటికి చేరకముందే…!”
అని నేటి హీనమైన మానవ సంబంధాలను గమనించి రాసాడు. ఇదే రీతిగా మరో నానీలో
“బతుకు యాత్రలో
తోడులేరు
శవయాత్రలో మాత్రం
ఎందరో బంధువులు”
అని దిగజారి పోయిన మానవీయ విలువలు, సంబంధాల గూర్చి ప్రకాశ్ అంటాడు. నేటి లోకంలో నమ్మకాలు నాశనమైపోతున్ననేటి స్థితిని
“అబద్ధం కూడా
ఒట్టేసి …చెప్పాలి
నిజాన్నికూడా
నమ్మని ఈ ప్రపంచానికి”
అని అంటాడు ప్రకాశ్.
నేటి జనానికి చిన్న సమస్యలకుకూడా చావే పరిష్కారంగా తోస్తుంది .అందుకే ఇన్ని ఆత్మహత్యలు…ఈ పరిశీలనలో నుంచే ~
“బ్రతకడమే కష్టంగా ఉన్న
ఈ రోజుల్లో …
ఎంత తేలికైపోయింది
చావడం…!”
అని అంటూ ఈ రకమైన ధోరణిని నిరసించాడు  కవి నానీ( ప్రకాశ్) నానీగా!. మరొక నానీలో ~
“ఆమె దాదాపు
నగ్నంగానే ఉంది
వేసుకున్న
బిగుతు దుస్తుల్లో …”! 
అని వెర్రితలలువేసే నగర జీవన వస్త్ర సంస్కృతిని అసహించుకున్నాడు.
ఈ రకమైన ఎన్నో ఉత్తమ నానీలతో కూడిన సంపుటిని తెలుగువారికి అందించినందుకు ప్రకాశ్ కు అభినందనలు.
~ సమీక్షకులు :డా.తలతోటి పృథ్వీ రాజ్