డా.తలతోటి పృథ్వీ రాజ్

డా.తలతోటి పృథ్వి రాజ్ కు  హైకూలకి ఎంత విడదీయలేని అనుబంధం ఉందో ....;నానీలకూ...పృథ్వి కీ అంతే అనుబంధం ఉంది. డా తలతోటి పృథ్వి రాజ్ అక్టోబర్ 2004 లో "అడుగులు" అనే నానీ సంపుటిని తానూ రచించి ప్రచురించడమే కాకుండా, వివిధ నానీ కవులు రచించిన ప్రసిద్ధమైన నానీలను ఎంపిక చేసి మధుర గాయకుడు శ్రీ ప్రధాన ఆదినారాయణ గారిచేత నానీలకు బాణీలు కట్టించి,పాడించి పృథ్వి వ్యాఖ్యాతగా,రూపకర్తగా తొలుత రూపొందించిన ఆడియో సీడీ  "నానీ బాణీలు".దీనిని హైకూ క్లబ్ పోషకులు డా.కె.విష్ణుమూర్తి గారు 13 నవంబర్ 2004 న "అడుగులు"ఆవిష్కరణ సభలో సీడీని ఆవిష్కరించారు.ఆ తర్వాత శ్రీ పి.లక్ష్మణ్ రావ్ రచించి నానీ సంపుటిలోని నానీలతో "నావి-నీవీ",డా.ఎస్.రఘు రచించిన "జీవన లిపి",శ్రీమతి ఎన్.అరుణ గారు రచించిన "గుప్పెడు గింజలు"ను,ద్వా.నా.శాస్త్రి గారి "సాహిత్య నానీలు"ను,శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి మూడు నానీ సంపుటాలలోని మంచి నానీలను ఎంపికచేసి "సోమేపల్లి వెంకటసుబ్బయ్య నానీలు"అని డా.తలతోటి పృథ్విరాజ్ తను వ్యాఖ్యాతగా ఆడియో/వీడియో సీడీలుగా రూపొందించారు. నానీల సృష్టికర్త డా.ఎన్.గోపి గారి కొన్ని నానీలను ఆడియో క్యాసెట్ గా రూపొందించారు 2010 నానీల అవార్డు సందర్భంగా అవార్డు నానీలతో "నానీ దృశ్యాలు","కవితా లోగిలి" వీడియో సీడీలను రూపొందించి శ్రీ.బి.వి.బంగార్రాజు,సి.ఎస్ రావ్ గార్లచే ఆవిష్కరింప జేశారు పృథ్వి రాజ్. తాను సంపాదకునిగా నిర్వహిస్తున్న హైకూ మాసపత్రికను అక్టోబర్ 2003 , తాను రచించిన నానీల వ్యాసంతో ప్రత్యేక పత్రికగా అందించారు.ఇండియన్ హైకూ క్లబ్ వ్యవస్థాపకులు గా,సాహిత్య కార్యక్రమాల నిర్వాహకునిగా ప్రసిద్ధులతో షుమారు 80 కార్యక్రమాలకు పైగా సాహితీ సమావేశాలను,పలు పురస్కారాలు-అవార్డు లు స్థాపించి- నిర్వహించిన పృథ్వి రాజ్ 18 డిసెంబర్ 2005 న "నానీలు అవార్డు"ను   డా.ఎస్ రఘు రచించిన "జీవన లిపికి" ప్రదానం చేసి ప్రారంబించారు.2010 ఈ అవార్డ్స్ ని పునః ప్రారంబించి 2006 ,2007 ,2008 ,2009 సంవత్సరాలకు వరసగా డా.నలిమెల భాస్కర్ గారి "మట్టిముత్యాలు",శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారి "చిగిరింతలు",శ్రీమతి కోపురి పుష్పావతి గారి "పూల రేకులు" శ్రీ జిసనారా గారి "వెన్నెల చినుకులు" నానీ సంపుటాలకు ఒక్కొక్కరికి ౩,ooo /-నగదు పురష్కారం,శాలువా,ప్రశంసాపత్రం,జ్ఞాపికలతో అత్యంత వైభవంగా డా.తలతోటి పృథ్వి రాజ్ గారు "నానీల అవార్డు ప్రదానోత్సవం"కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అవార్డు నానీలను "తాను మాత్రమే నానీలు రాయడం గాకుండా ఇతరులనుకూడా ప్రోత్సహించాలనే దృష్టితో "నానీల అవార్డ్స్"సందర్భంగా "నలుదిక్కుల నానీలు"అనే సంకలనాన్ని జి.రంగబాబు,బద్ది నాగేశ్వర రావు,జి.బ్రహ్మాజీ లను కలుపుకొని తొలి నానీల సంకలనంగా ఈ "నలుదిక్కుల నానీలు"అనే నానీల సంకలనాన్ని తీసుకొచ్చారు. అనేకమైన నానీలను వ్యాఖ్యానిస్తూ వీడియోలు గా రూపొందించి ప్రసిధ వెబ్ సైట్ www.youtube.com   లో పొందుపరచడ మైనది. ఇంతే కాదు స్వయంగా నానీలు బ్లాగ్ ను నిర్వహిస్తున్నాడు. సాంకేతికతతో నానీలను ఖండాంతరాలకు వ్యాపింప జేశాడు పృథ్వి. నానీ కవుల పక్షాన పృథ్వి రాజ్ కి హ్యాట్సాఫ్ !!         




డా.తలతోటి పృథ్వి రాజ్ 
"నలుదిక్కుల నానీలు"
     సంకలనంలోనివి 
అనుభవ పాఠాల్ని    
పఠించాలనుకునేవాళ్లేరీ
మహా గ్రంథాలే
వృద్ధులు 
దళారులు
ఉరితాడు లేకుండానే 
రైతుల ఉసురుతీసే 
తలారులు 
సామాజిక కవిత్వం
ప్రారంభించాను 
కలం 
అక్షరాల కొలిమైంది 
ఎక్కడ చూసినా 
గుళ్ళూ ,చర్చీలు, మసీదులు!
సామరస్యానికి 
చోటేక్కడా?
నిజం 
ఎప్పటికీ నిప్పే 
అబద్దమే
నిజాన్ని దాచాననుకునే నివురు 
భూగోళం అంచుపై
కనురెప్పను వాల్చింది 
కాంతినేత్రం.
- పురివిప్పిన నింగి 
మూగవాళ్ళ
సంజ్ఞలు 
మాటల మోసాలు లేని 
స్వచ్ఛ మైన భాష
భార్యంటే నేటి అర్థం 
భర్తలో సగం కాదు 
కష్టాల్లో పూర్ణం 
సుఖాల్లో శూన్యం
చచ్చాక కూడా  
ఆక్రమణలే !     
కూడళ్ళలో 
నాయకుల విగ్రహాలు !!
నలుదిక్కులు 
ప్రసరించిన
హృదయభాను కిరణాలు 
నానీలు  
జీవితమంటే 
రోజూ కొంచెం కొంచెం 
ఆశతో 
బ్రతుకుతూ చావడం 
పిల్లాడి చేతిలో 
బలపమై 
వెలిగిపోతూ ఆరిగిపోతూ 
మాస్టారు 
ఆకలి తీర్చేందుకు 
దొరకని గంజి 
నేత ఖద్దరు చొక్కాకు 
కానుకైంది
నాది డాక్టరేట్ 
మా అబ్బాయ్ ఫోర్త్ క్లాస్  
నాకంటే 
మావాడి చదువే 'విలువైంది'
వంటింటి 
కారాగార గృహంలో 
ఆజన్మాంత ఖైదీ 
త్యాగాల అమ్మ 
ఎలుకల గొడవ 
పిల్లి తీర్చునో లేదో గాని 
దొంగల పంపకం 
పోలీస్లే...!
ఇల్లు శుభ్రంగా ఉంచుతాడు 
వీధే... !
మనిషి శుభ్రంగా ఉంటాడు 
కాని మనసే...!!
ప్రజాస్వామ్య క్షేత్రంలో 
కలుపు మొక్కలు..
పదునులేని కొడవళ్ళు 
ప్రజలు 
దేశపౌరుల తలరాతల్ని 
తిరగరాసే 
అపర బ్రాహ్మలు 
నేతలు 
వారధి మీదుగా
అఘాదాల్ని దాటుతాం
స్నేహ వారదుల్నే
నిర్మించుకోం! 
ఎగువ రాష్ట్రం
డ్యాంల నిర్మాణం .
బురద చల్లుకుంటూ 
పాలక-ప్రతిపక్షాలు.
దొంగలందరూ 
ఒకేలా పుట్టరు
కొందరు ఆకల్లోంచి 
ఎందరో ఓట్లలోంచి...
పట్టా భూమితో
రైతుకి భరోసా.
ఎన్ని  పట్టాలున్నా
నిరుద్యోగికి నిరాశ! 
అనగనగా...
ఒకానొకప్పుడు పిచ్చుకలు!
సెల్ ఫోన్ హత్యలకు 
తొలి బలి
ఎన్నో పార్టీలే కల్సి 
పాలన సాగిస్తుంటే 
వెర్రోళ్ళు
విడాకులు కావాలట!    
   * * * * * * * 
   డా.తలతోటి పృథ్వి రాజ్ 
"క్రాంతి నేత్రం" నానీల సంపుటి 
          (అముద్రితం)
మరణించడమంటే
మహా యాత్రను చాలించడం 
మరొక్కరికి
చోటివ్వడం 
పడమర
అగాధపుటంచుల్లో తొంగి చూడు
రోజుల
శకలాల  కోసం 
రోజూ రగిలే
ఎందరి విప్లవ స్వప్నాలో 
ధరిస్తూ
పునర్జన్మల రవి
యాంత్రిక లోకమే అనుకున్నా
తాంత్రిక లోకంగా తీర్చే 
బాణామతి... 
బాబాలు !
విలువైనవెన్నో
వెలికి తీస్తాడు
విలువలేకుండా
మట్టిలోకి మనిషే...
దేవుడి దర్శనానికి 
గుడిమెట్లు
జీవితాదర్శానికి
బతుకు  మెట్లు 
క్షణికావేశపు చిహ్నానికి 
చెత్తలా
విసిరి పడేసేందుకేమో
చెత్త కుండీలు 
చిగురు
చైతన్యానికి ప్రతీక!
పండుటాకు
అనుభవాల సంపుటి!!
వరల్డ్  బ్యాంక్ 
ప్రతినిధుల రాక
బిచ్చగాళ్ళను తరిమేస్తూ 
ప్రభుత్వ బిచ్చగాళ్ళు
ఒకపూట 
భోంచెయ్యడం కుదరలేదు 
ఆకలి  బాధ 
రుచితెలిసింది 
ప్రతి తల్లీ 
వీరమాతే 
రక్తం అద్ది బిడ్డను పంపు
జీవన సమరానికి